ఇంద్రియ నిగ్రహ సాధన.....

*ఇంద్రియ నిగ్రహ సాధన.....*


ఇంద్రియములు అంటే ఙ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని. వాటిలో మనస్సు కూడా ఒక ప్రధానమైన ఇంద్రియం. అదే కర్మలకు కారణమైన ప్రధాన ఇంద్రియం. తనకు ఇష్టమైన దాని మీదకు పోవటం దాని సహజ లక్షణం. అది దానికి ఇష్టం లేని దాని మీదకు పోదు. ఎందు చేతనంటే దాని వలన దానికి ప్రయోజనం లేదు కనుక! అలాంటప్పుడు ఎందుకు శ్రమపడాలి? కాబట్టి మనస్సుకు (ఇంద్రియానికి) ఏది ఆకర్షణముగా ఉంటుందో, దేనివలన తాను కోరుకున్న ఆనందం కలుగుతుందో దాని మీదనే ఆశక్తి ప్రసరిస్తుంది. అది లౌకికమైన తాత్కాలిక ఆనందం. కష్టసాధ్యమైన పారమార్ధిక విషియాలవైపు మనస్సు పోదు. అటువంటి మనస్సును నిగ్రహించి దానిని పారమార్ధికమైన విషియాలవైపు మళ్ళించటం కష్టసాధ్యమైన కార్యం. ఆ విధముగా మనస్సును మళ్ళించగల శక్తిని సమకూర్చుకోవటాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు.

కాబట్టి లౌకిక సుఖాన్ని కాదు అనుకుని పారమార్ధిక సుఖానికై మానవుడు ప్రయత్నం చెయాలి. ఈ ప్రయత్నం నిరంతరం సాగుతునే ఉండాలి. కార్య సాధనకు ప్రయత్నం అవసరం. అదే ముఖ్యం! లేకపోతే మనస్సును నిగ్రహించి కార్యోన్ముఖముగా చేయటం ఎట్లా సంభవిస్తుంది. కాబట్టి కార్యసాధనకు తీవ్రమైన ప్రయత్నం చెయ్యాలి. ఆలోచన చెయ్యాలి.. ఆలొచన అంతర్ముఖం చేసుకొని మనస్సు ఏ విషియాలకు లోను అవుతుందో వాటిని నిరోధించుకునే ప్రయత్నం చెయ్యాలి. 

మనకు ఇష్టంలేని ప్రస్థావన తీవ్రమైనప్పుడు మనకు కోపం వస్తుంది. క్రోధం అంతః శత్రువు. హద్దు మీరుతుంది. చేయకూడని పని చేస్తుంది. మాట్లాడకూడని మాటలను మాట్లాడిస్తుంది. దీనివలన అనర్ధం జరుగుతుంది. అది తనకు మంచి చేయదు, ఎదుటివారికీ ప్రయోజనం కలిగించదు. అటువంటి క్రోధాన్ని ప్రయత్నపూర్వకముగా నిగ్రహించాలి.

సహనం, వివేకం అలవరుచు కోవాలి. మనకు అనుకోని విధముగా ఒక విఘాతం (ఆపద) ఏర్పడింది అనుకుందాము. త్రోవన పోయే ఒకని ని హటాత్తుగా పాము కాటు వేసింది అనుకుందాము. అది ఆకస్మికమైన విపత్తు. దానికి ఏడ్చి పొడబొబ్బలు పెట్టి, ఇతరులను నిందించి, పాముపై క్రోధం పెరిగి, దానిని చంపటానికి ప్రయత్నించి, అది కనపడకుండా పోయి, దానిపై పగ, భయము పెంచుకుంటూ పోతే చేయవల్సిన కార్యం మరచి సమయం వ్యర్ధమవుతుంది. దాని వలన ఏమి ప్రయోజనం.. అటువంటి సమయంలో సహనము, వివేకముతో కూడిన కార్యము తలపెట్టాలి.

ఏ కార్యం జరగటానికైనా ఒక కారణం ఉంటుంది. ఆ పాము కాటు వేయటానికి ఒక ప్రేరణ ఉండి ఉంటుంది. అదియే దైవ ప్రేరణ. (శివుని ఆఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని లోకోక్తి) ప్రారబ్ద కర్మాను పాలనంలోనే అట్లా జరిగి ఉంటుంది అని భావించాలి. అట్లా విచారణ చేయటమే వివేకం. ఈ విచారణము వివేకముచే స్థిరపరుచుకుని నిర్ణయం చేసుకోగలుగుతున్నాము.

ఈ విధమైన విచక్షణ చేయగలగటానికి ఎన్నో కఠినమైన పరిస్థితులు, అవరోధాలు కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. వీటిని సహనంతో అధిగమించాలి. దీనినే తితిక్ష అని కూడా అంటారు. తితిక్ష కలవాడే వేదాంత శిక్షణకు యోగ్యుడు. అటువంటి వానికే శాస్త్రము యెడల శ్రద్ధ కలుగుతుంది శాస్త్రంలో శ్రద్ధ అంటే విశ్వాసం. శాస్త్రం ఏది నిర్దేసిస్తుందో అది చేయాలి. ఆ విధముగా శాస్త్రం ఎందుకు చెప్పింది అన్న దానిపై పరిశోధన చేయకూడదు. శాస్త్రంపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే చాలదు. శాస్త్రం చెప్పిన విధముగా ఆచరించాలి...

*|| ఓం నమః శివాయ ||*


0/Post a Comment/Comments

Previous Post Next Post