పప్పులతో జబ్బులు దూరం .

పప్పులతో జబ్బులు దూరంఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


    శనగలు, మినుములు, రాజ్మా, కందులు, పెసర్ల వంటివి తరచుగా తింటూనే ఉంటాం. ఇలాంటి పప్పుల్లో, చిక్కుడుజాతి గింజల్లో పీచు, ప్రోటీన్లు దండిగా ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి. వెంటనే ఆకలి కాకుండా చూస్తాయి. నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలోకి చక్కెర వెంటనే విడుదల కాకుండా చేస్తాయి. అంతేకాదు శరీరానికి బలాన్ని ఇవ్వటంతో పాటు జబ్బులను నివారించుకునే శక్తినీ అందిస్తాయి. కాబట్టి కొన్ని బీన్స్‌, పప్పులు మనకు ఎలాంటి మేలు చేస్తాయో చూద్దాం.

కాబూలీ శనగలు

వీటిల్లోని పీచు రక్తంలో చక్కెర మోతాదులు స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అందువల్ల కాబూలీ శనగలను తరచుగా తీసుకుంటే మధుమేహం ముప్పు తగ్గటానికి తోడ్పడతాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్‌ను (ఎల్‌డీఎల్‌), ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఫలితంగా గుండెజబ్బులూ దూరంగా ఉంటాయి. అయితే వీటిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అప్పుడే ఎక్కువ లాభాలు.

పప్పులు

కందులు, పెసర్ల వంటి పప్పులు క్యాన్సర్ల బారినపడకుండా కాపాడతాయి. తరచుగా పప్పులు తినే మహిళలకు రొమ్ముక్యాన్సర్‌ ముప్పు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాల్లో బయటపడింది. ప్రోస్టేట్‌, మలద్వార క్యాన్సర్ల బారినపడకుండా కాపాడుతున్నట్లూ వెల్లడైంది. వీటికి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణమూ ఉంది.

రాజ్మా

విషయగ్రహణ శక్తిని పెంపొదించే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు రాజ్మాలో అధికంగా ఉంటాయి. అలాగే క్యాన్సర్‌ను నివారించే యాంటీఆక్సిడెంట్లూ, అల్త్జెమర్స్‌ బారినపడకుండా చూసే థైమీన్‌ కూడా దండిగానే ఉంటాయి.

ఉలవలు

ఇనుము, క్యాల్షియం, మాలిబ్డినమ్‌ వంటివి ఉలవల్లో దండిగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్‌ గుణాలు గల ఫాలీఫెనాల్స్‌ కూడా ఎక్కువే. ఇవి క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. యాంటీబోడీలు, స్వీయరోగనిరోధక చర్యల్లో కనిపించే హీమగ్లుటినిన్‌ కూడా వీటిల్లో కనిపిస్తుంది. ఉలవలు కొలెస్ట్రాల్‌, కడుపు ఉబ్బరం తగ్గటానికీ తోడ్పడతాయి.

సోయాబీన్స్‌

వీటిల్లో మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలూ ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి బాగా తోడ్పడతాయి. ప్రస్తుతం వీటితో తయారుచేసిన పాలు, టోఫూ వంటివీ అందుబాటులో ఉంటున్నాయి. అయితే సోయాబీన్స్‌ ఉత్పత్తులను పరిమితంగానే తినాలని గుర్తుంచుకోవాలి.

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd