చియా విత్తనాల ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
మట్టి రంగులో మరియు అండాకారంలో ఉండే చియా విత్తనాలు. చియా మొక్క, సాల్వియా హిస్పానికా (Salvia hispanica) నుండి వస్తాయి. సాధారణంగా 1 మిల్లీమీటర్ వ్యాసంలో ఉండే ఈ చిన్న విత్తనాలు శక్తికి నిల్వలుగా కూడా ఉంటాయి. నిజానికి, వాటికీ ఆ పేరు బలం అని అర్ధం వచ్చే ఒక పురాతన మాయన్ పదం వచ్చింది. కొందరు చరిత్రకారుల ప్రకారం, చియా గింజలు మొట్టమొదట అజ్టెక్ తెగలచే సాగు చేయబడ్డాయి. వీరు ఆధునిక మెక్సికో మరియు గ్వాటెమాల చుట్టూ ఉండి ఉంటారు. చియా విత్తనాల యొక్క ఈ శక్తిని కలిగించే లక్షణాలు అమెరికన్ ఇండియన్ తెగలచే చాలా పవిత్రమైనవిగా పరిగణించబడ్డాయి. వారు చియా విత్తనాల అజ్టెక్ పూజారులకు కూడా సమర్పించేవారు.
ఈ రోజుల్లో, చియా విత్తనాలను వాణిజ్యపరంగా దక్షిణ అమెరికా అంతటా, మధ్య అమెరికా, మరియు ఆస్ట్రేలియాలలో కూడా సాగు చేస్తున్నారు.
గొప్ప చరిత్ర కలిగి ఉండడమే కాక, చియా విత్తనాల యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలు వలన వాటికి చాలా వేగంగా ఆధునిక సూపర్ఫుడ్ అనే పేరు కూడా వచ్చింది. ఈ విత్తనాలలో పుష్కలంగా ఒమేగా -3 ఫ్యాటి యాసిడ్లు మరియు ఫైబర్లు ఉండడంతో పాటు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు అధిక పరిమాణంలో కూడా ఉంటాయి. కాబట్టి, ఇవి శరీరానికి పోషకాలు అందించడమే కాక, జీర్ణ రుగ్మతలు, హృదయ సంబంధ వ్యాధులు, మరియు రక్తపోటు వంటి వివిధ సమస్యలపై వ్యతిరేకంగా పోరాడడంలో కూడా మనకు సహాయపడుతాయి. చియా విత్తనాల యొక్క ఈ పోషకరమైన మరియు ఆరోగ్య ప్రయోజనకరమైన లక్షణాలు అన్ని తెలుసుకున్న తర్వాత, చియా గింజలు నిజమైన ఫంక్షనల్ ఫుడ్ (మాములు ప్రయోజనాలే కాక దీర్ఘకాలిక వ్యాధులను తాగించే మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహారాన్ని పదార్దాన్ని ఫంక్షనల్ ఫుడ్ అని అంటారు) అని భావించడం కష్టం కాదు.
చియా విత్తనాల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
శాస్త్రీయ నామం: సాల్వియా హిస్పానికా (Salvia hispanica)
కుటుంబం: లాబెటే (Labiatae)
ఇతర పేర్లు: మెక్సికన్ చియా లేదా సాల్బా చియా
స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఇది మెక్సికో మరియు గ్వాటెమాల ప్రాంతాల యొక్క స్థానిక మొక్క, అలాగే వాణిజ్యపరంగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బొలివియా, ఈక్వెడార్, నికారాగువా, పెరు మరియు యునైటెడ్ స్టేట్స్ లో కూడా సాగు చేస్తున్నారు.
సరదా వాస్తవం: కాలిఫోర్నియాకు చెందిన జోసెఫ్ ఎంటర్ప్రైజెస్ Inc నుండి జో పెడోట్ అనే వ్యక్తి, చియా మొలకలను జంతువుల ఆకారపు టెర్రకోట బొమ్మలను విక్రయించారు. కొన్ని వారాలు వాటికీ నీరు పోసిన తర్వాత, చియా మొక్కలు జంతువుల బొచ్చు రూపంలో పెరిగాయి. 2007 లో, US లో, సుమారుగా 5,00,000 ఈ పెంపుడు జంతువుల ఆకారపు చియా మొక్కలు ఇంటిలో ఒక రకమైన కొత్త అలంకరణగా అమ్ముడయ్యాయి.
- చియా గింజలు వెర్సెస్ సబ్జా గింజలు
- చియా విత్తనాల పోషక వాస్తవాలు
- చియా విత్తనాల ఆరోగ్య ప్రయోజనాలు
- చియా విత్తనాలను ఎలా ఉపయోగించాలి
- చియా విత్తనాల దుష్ప్రభావాలు
- ఉపసంహారం
చియా గింజలు వెర్సెస్ సబ్జా గింజలు
చాలామంది సబ్జా గింజలను చియా గింజలని పొరబడతారు. కానీ సబ్జా గింజలు మరియు చియా గింజలు పూర్తిగా కూడా భిన్నమైనవి.
చియా మొక్క నుండి చియా గింజలు లభిస్తాయి. కానీ సబ్జా గింజలు వేరే రకమైన తులసి మొక్క నుండి లభిస్తాయి.
చియా అమెరికాకు చెందినది మరియు తులసి ఒక భారతీయ మొక్క.
చియా విత్తనాలు గ్రే రంగు నుండి గోధుమ రంగులో నలుపు మరియు తెలుపు రంగులతో మచ్చలతో ఉంటాయి. సాబ్జా గింజలు సాధారణంగా నల్లగా ఉంటాయి.
సాబ్జా గింజలతో పోల్చిస్తే చియా గింజలు కొంచెం పెద్దగా కూడా ఉంటాయి.
చియా విత్తనాలు అండాకారంలో ఉంటాయి. కానీ సబ్జా విత్తనాలు ఒక నీటి బిందువు ఆకారం కలిగి ఉంటాయి.
చియా విత్తనాల పోషక వాస్తవాలు
చియా విత్తనాలను ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ యొక్క గొప్ప వనరుగా కూడా భావిస్తారు, ఇది మొక్కలలో ఉండే ఒక ఒమేగా -3 ఫాటీ యాసిడ్. ఎండిన చియా గింజల యొక్క దాదాపు సగం పరిమాణం కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా, వీటిలో ప్రోటీన్లు, వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు, కొవ్వులు, మరియు డైటరీ ఫైబర్ కూడా ఉంటాయి. ఈ విత్తనాలు పాల కంటే ఎక్కువ శాతంలో కాల్షియం, పొటాషియం మరియు మెగ్నీషియంను కలిగి ఉంటాయి. నిజానికి, యూరోపియాన్ యూనియన్ చియాను అద్భుతమైన ఆహారంగా అంగీకరించింది మరియు యూరోపియన్ పార్లమెంట్ చియా విత్తనాలను ఫంక్షనల్ ఫుడ్ గా కూడా ప్రకటించింది. ఈ రెండు పేర్ల వలన జపాన్, కెనడా, న్యూజీలాండ్, మరియు ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో చియా విత్తనాలు చాలా ప్రజాదరణ పొందాయి.
యూ.ఎస్.డి.ఏ(USDA) న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, చియా గింజలు ఈ క్రింది పోషక విలువను కలిగి ఉంటాయి:
పోషకాలు:100గ్రాములకు
నీరు:5.80 గ్రా
శక్తి:486 కిలోకేలరీలు
ప్రోటీన్:16.54 గ్రా
ఫ్యాట్స్:30.74 గ్రా
కార్భోహైడ్రేట్స్:42.12 గ్రా
ఫైబర్:34.4 గ్రా
మినరల్స్
కాల్షియం:631 mg
ఐరన్:77.2 mg
మెగ్నీషియం:335 mg
ఫాస్ఫరస్:860 mg
పొటాషియం:407 mg
సోడియం:16 mg
జింక్:4.58 mg
విటమిన్లు
విటమిన్ సి:1.6 mg
విటమిన్ బి1:0.620 mg
విటమిన్ బి2:0.170 mg
విటమిన్ బి3:8.830 mg
విటమిన్ ఏ:54 mg
విటమిన్ ఇ:0.50 mg
ఫ్యాట్స్/ ఫ్యాటీ ఆసిడ్స్
సాచురేటెడ్:3.330
మోనోఅన్సాచురేటెడ్:2.309
పోలిఅన్సాచురేటెడ్:23.665
ట్రాన్స్;0.140
చియా విత్తనాల ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవలి కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పట్ల అందరికీ చాలా ఆసక్తి పెరిగింది. పలు విభిన్నమైన వ్యాయామాలను అనుసరించడం దగ్గర నుండి వివిధ రకాల ఆరోగ్యకర ఆహార విధానాలను తెలుసుకోవడం వరకు ప్రజలు ఎప్పుడు కొత్త విధానాలను అన్వేషిస్తూ ఉంటారు. అటువంటి సమయాల్లో, కృత్రిమ సప్లీమెంట్లు చాలా డిమాండులో కూడా ఉంటాయి. అయితే, వీటి యొక్క ప్రతికూల ప్రభావాలు వలన, పోషకాహార నిపుణులు వేగంగా సహజ పోషక సప్లీమెంట్ల గురించి అన్వేషిస్తున్నారు. చియా విత్తనాలు ప్రపంచంలోనే అత్యంత పోషకరమైన విత్తనాలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి, అవి వివిధ శరీర భాగాల పనితీరును నిర్వహించడంలో కూడా చాలా సహాయకరంగా కూడా ఉంటాయి. అందువల్ల, చియా విత్తనాలను తరచుగా సూపర్ఫుడ్ లేదా ఫంక్షనల్ ఫుడ్ అని కూడా అంటారు.
ఈ విత్తనాలు ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ మరియు ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చియా విత్తనాలలో ఉండే డైటరీ ఫైబర్, మంచి ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు మరియు విటమిన్లు జీర్ణ రుగ్మతలు, మానసిక రుగ్మతలు, మధుమేహం వంటి రుగ్మతల పై పోరాడడంలో కూడా సహాయపడతాయి. ఇవి యాంటీ ఇన్ఫలమేటరీ,యాంటీ-యాంజైటీ, మరియు యాంటీ-బ్లడ్ క్లోట్టింగ్ ఏజెంట్గా కూడా పరిగణించబడతాయి. చియా విత్తనాలపై జరిపిన అధ్యయనాల ద్వారా, చియా విత్తనాలు వంటి విభిన్న మొక్కల పదార్దాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టంగా కూడా తెలుస్తుంది.
మలబద్ధకాన్ని తగ్గిస్తుంది: చియా గింజలు డైటరీ ఫైబర్ యొక్క అద్భుతమైన వనరులుగా ఉన్నాయి. ఇది ప్రేగు కదలికలను క్రమబద్దీకరించడం ద్వారా మలవిసర్జనకు కూడా సహకరిస్తాయి మరియు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి.
యాంటీ-డయాబెటిక్: క్లినికల్ అధ్యయనాలు చియా విత్తనాలు మధుమేహ వ్యక్తులలో పోస్ట్ ప్రాండయల్ (భోజనం చేసిన తర్వాత) బ్లడ్ గ్లూకోజ్ స్థాయిల యొక్క పెరుగుదలను నిరోధిస్తాయని సూచించాయి. సులభంగా అందుబాటులో ఉండడం మరియు ఎటువంటి అధిక దుష్ప్రభావాలు లేకపోవడం వలన, మధుమేహ వ్యక్తుల కోసం వీటిని ఒక అద్భుతమైన చిరుతిండి ఎంపికగా కూడా చేసుకోవచ్చు.
యాంటీ ఇన్ఫలమేటరీ: పరిశోధనల ఆధారాలు చియా గింజలలో కొన్ని చురుకైన సమ్మేళనాలను ఉన్నట్లు కనుగొన్నాయి. ఇవి కీళ్ళనొప్పులు మరియు బ్రోన్కైటిస్ వంటి ఇన్ఫలమేటరీ సమస్యలలో వాపు మరియు ఎరుపుదనాన్ని తగ్గిస్తాయి. తద్వారా ప్రభావిత వ్యక్తులకు లక్షణాల నుండి ఉపశమనం కూడా అందిస్తాయి.
బరువు తగ్గుదలను ప్రోత్సహిస్తాయి: మధ్యాహ్నపు చిరుతిండిగా పెరుగులో చియా గింజలను కలిపి తీసుకోవడంవలన ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నభావనను కలిగించి అనవసరమైన చిరుతిళ్లను తీసుకునే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతేకాక, ఇవి కేలరీల సంఖ్యలో తక్కువగా ఉంటాయి, తద్వారా బరువు తగ్గుదలను బాగా ప్రోత్సహిస్తాయి.
చర్మం కోసం ప్రయోజనాలు: చియా విత్తనాలు మరియు చియా విత్తనాల నూనె చర్మంపై మృదువైన మరియు హైడ్రేటింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి దురదను మరియు అధికంగా గోక్కోవడాన్ని తగ్గిస్తాయని సూచించబడ్డాయి . తామర లక్షణాలను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి.
చనుబాలు ఇచ్చే తల్లులకు ప్రయోజనాలు: చియా విత్తనాల వినియోగం డిహెచ్ఏ (DHA), ఒక రకమైన ఫ్యాటీ ఆసిడ్ యొక్క స్థాయిలను పెంచుతుందని ధృవీకరించబడింది. ఇది మెదడుపై ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. అది చనుబాలు ఇచ్చే తల్లులలో మెదడు పనితీరును మెరుగుపరచడమే కాక, నవజాత శిశువులలో సరైన మెదడు అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది.
- మధుమేహం కోసం చియా విత్తనాలు
- జీర్ణక్రియ కోసం చియా విత్తనాలు –
- బరువు తగ్గుదల కోసం చియా గింజలు
- చియా విత్తనాలు రక్తపోటును తగ్గిస్తాయి
- గుండె కోసం చియా విత్తనాలు
- యాంటి ఇన్ఫలమేటరీగా చియా విత్తనాలు
- చర్మం కోసం చియా విత్తనాలు –
- చనుబాలు ఇచ్చే తల్లులకు చియా విత్తనాలు
- చియా విత్తనాలు అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు
- చియా విత్తనాలు క్యాన్సర్ను నిరోధిస్తాయి
- సిలియక్ రోగులకు చియా గింజలు
మధుమేహం కోసం చియా విత్తనాలు
ఆరోగ్యకరమైన వ్యక్తులపై నిర్వహించిన నియమరహిత (random) అధ్యయనంలో, చియా విత్తనాల వినియోగం భోజనం తర్వాత రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల తగ్గుదలకి దారితీసిందని కూడా తెలిసింది. ఇతర సప్లీమెంట్ల వాలె కాక, చియా విత్తనాలు ఎటువంటి ప్రతికూల ప్రభావాలు చూపించలేదు.
అలాగే, ఈ విత్తనాల వినియోగం యొక్క ఫ్లెక్సిబిలిటీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి దీనిని ఒక ఉత్తమమైన సహజ ఆహారపు నివారణ చిట్కాగా కూడా చేస్తుంది.
జీర్ణక్రియ కోసం చియా విత్తనాలు
చియా విత్తనాలు డైటరీ ఫైబర్ యొక్క గొప్ప మూలం. డైటరీ ఫైబర్ యొక్క వినియోగం మలబద్ధకం కోసం ఒక అద్భుతమైన నివారణ అని చెప్పవచ్చును . ఇది మలం విసర్జనను సులభతరం కూడా చేస్తుంది.
ఏదేమైనా, వీటికి ఇతర జీర్ణానికి సంబంధిత ప్రయోజనాలు ఏమి లేవు.
బరువు తగ్గుదల కోసం చియా గింజలు
మధ్యాహ్నపు చిరుతిండిగా పెరుగుతో చియా గింజలను తీసుకుంటే కలిగే ప్రభావాలపై ఒక అధ్యయనం నిర్వహించబడింది. దానిలో ఈ విత్తనాలు ఆకలి తగ్గించేలా పనిచేస్తాయని మరియు చిరుతిండిగా ఆరోగ్యకరమైన ఎంపిక అని తెలిసింది. ఇది, క్యాలరీలు తీసుకోవడాన్ని కూడా తగ్గిస్తుంది. తద్వారా ఆహారపు అలవాట్లను మెరుగుపరుస్తుంది. అందువలన, చియా విత్తనాలు ఊబకాయాన్ని నిరోధించడానికి కూడా ఉపయోపడతాయి.
చియా విత్తనాలు రక్తపోటును తగ్గిస్తాయి
26 మంది రక్తపోటు రోగులలో చియా గింజల పిండి వినియోగం యొక్క ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఒక చిన్న క్లినికల్ అధ్యయనం నిర్వహించబడింది. చియా పిండి ఈ బృందానికి ఒక 12 రోజుల పాటు ఇవ్వబడింది. నియమిత కాలం పూర్తైన తర్వాత చియా పిండి వినియోగం, రక్తపోటుకు మందులు వాడే వారిలో మరియు రక్తపోటుకు మందులు వాడని వారిలో కూడా సమానముగా రక్తపోటును తగ్గించిందని కూడా తెలిసింది.
గుండె కోసం చియా విత్తనాలు
చియా విత్తనాలలో ఫైబర్ మరియు ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్లు అధికంగా ఉంటాయి. వీటిని గుండె ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. అవి రెండు కలిసి, అధిక రక్తపోటు మరియు కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి వివిధ గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడమే కాక, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. కెనడాలో నిర్వహించబడిన ఒక పరిశోధనలో, టైప్ 2 మధుమేహ రోగులకు 12 వారాల పాటు చియా విత్తనాలను ఇచ్చారు. 12 వారాల తర్వాత చియా విత్తనాల దీర్ఘకాలిక వినియోగం వలన కార్డియోవాస్క్యులర్ వ్యాధి యొక్క ప్రమాద కారకం తగ్గినట్లు మరియు గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడంలో కూడా ఇవి సహాయపడినట్లు కూడా తెలిసింది.
యాంటి ఇన్ఫలమేటరీగా చియా విత్తనాలు
ఇన్ఫలమేషన్ అనేది వాపు, మంట మరియు ఎరుపుదనాన్ని సూచిస్తుంది ఇది బ్రోన్కైటిస్ మరియు ఆర్థరైటిస్ వంటి వివిధ వ్యాధులకు సంబంధించిన ఒక లక్షణం. చియా విత్తనాల నూనె కొన్ని పోలి అన్సాచురేటెడ్ ఫాటీ యాసిడ్లను (PUFAs) కలిగి ఉంటుందని అధ్యయనాలు సూచించాయి, ఇవి శరీరంలోని కొన్ని ఇన్ఫలమేటరీ మీడియేటర్స్ (COX-2) యొక్క చర్యను నిరోధిస్తాయి. చియా విత్తనాలు మరియు దాని నూనె వినియోగం ద్వారా వాపు యొక్క తీవ్రతను కూడా తగ్గించవచ్చు.
చర్మం కోసం చియా విత్తనాలు
చియా గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సరైన క్రీమ్స్ తో పాటుగా చియా విత్తనాల నూనెను క్రమముగా చర్మానికి రాసుకోవడం వలన చర్మపు హైడ్రేషన్ కూడా పెరుగుతుంది. అలాగే తామరను వంటి చర్మ సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది మరియు దురద మరియు అతిగా గోక్కోవడాన్ని తగ్గిస్తుంది.
చనుబాలు ఇచ్చే తల్లులకు చియా విత్తనాలు
నవజాత శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు మరియు సమ్మేళనాలు తల్లి పాల నుండి లభిస్తాయి. పాలిచ్చే తల్లులలో ఏదైనా లోపం నేరుగా నవజాత శిశువు యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. చియా గింజలు ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ యొక్క గొప్ప వనరు, ఇవి శరీరంలో డొకోసాహెక్సానాయిక్ యాసిడ్ (డిహెచ్ఏ, DHA) స్థాయిలు మెరుగుపరుస్తాయి. అసలు డిహెచ్ఏ అంటే ఏమిటి? డిహెచ్ఏ ఒక రకమైన ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్ ఇది మానవులలో ఆరోగ్యకరమైన మెదడు మరియు దృష్టిక/చూపుకి అవసరమైన ముఖ్య సమ్మేళనం.
చిలీ దేశంలో గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులపై నిర్వహించిన ఒక అధ్యయనం పాలిచ్చే తల్లులు తొలి మూడు నెలల పాటు చియా విత్తనాల నూనె వినియోగించడం వలన అది డిహెచ్ఏ పెరుగుదలను సూచించిందని పేర్కొంది. ఇది మహిళలకు సహాయకారిగా ఉండదు, కానీ వారి బిడ్డలలో సరైన మెదడు అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.
కాబట్టి గర్భధారణ యొక్క చివరి త్రైమాసికంలో మరియు ప్రారంభంలో చనుబాలిచ్చే నెలల్లో చియా విత్తనాల నూనెను తీసుకోవడం చాలా మంచిది.
చియా విత్తనాలు అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు
యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్ నష్టం మరియు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడే సమ్మేళనాలు. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఒక రకమైన ఆక్సిజన్ జాతులు, ఇవి శరీరంలో వివిధ మెటాబోలిక్ ఫంక్షన్ల ద్వారా ఉత్పత్తి అవుతాయి. కానీ ఈ రకమైన ఆక్సిజన్ అధికంగా ఉండడం వలన సాధారణ శరీర పనితీరు బలహీనపరుస్తుంది. బలహీనమైన శరీరం సులభంగా వ్యాధులకు గురైవుతుంది. చియా గింజలు యాంటీఆక్సిడెంట్లు మరియు ఫినొలిక్ యాసిడ్లలో అధికంగా ఉంటాయి. చియా విత్తనాల యొక్క ఈ లక్షణాలు రోగనిరోధక శక్తి పెరుగుదలకు మరియు ఫ్రీ రాడికల్ నష్ట నివారణకు బాగా సహాయపడతాయి.
చియా విత్తనాలు క్యాన్సర్ను నిరోధిస్తాయి
చియా గింజల యొక్క యాంటీ క్యాన్సర్ సంభావ్యతను పరీక్షించడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. కానీ ఆ రిపోర్టులు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. జపాన్లోని జర్నల్ ఆఫ్ ఎపిడమియాలజీలో ప్రచురించబడిన మెటా-విశ్లేషణ, చియా విత్తనాల యొక్క ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ఏఎల్ఏ) మరియు పోలిఅన్సాచురేటెడ్ ఫాటీ యాసిడ్ల (PUFA) పరిమాణానికి శక్తివంతమైన యాంటీక్యాన్సర్ ఎజెంట్ సామర్ధ్యం కలిగి ఉంటుందని తెలిపింది. క్యాన్సర్ కణ కణితి పెరుగుదల మరియు వ్యాప్తిని ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అణచివేయవచ్చని ఈ అధ్యయనం నివేదించింది. కానీ, ఏఎల్ఏ యొక్క కొన్ని మెటాబోలైట్స్ కణితి మరియు క్యాన్సర్ పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి.
కాబట్టి, క్యాన్సర్ చికిత్సలో చియా విత్తనాల యొక్క ప్రభావం విషయానికి వస్తే, చియా గింజల యొక్క క్యాన్సర్ వ్యతిరేక సంభావ్యతను తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ పరిశోధన అవసరమవుతుంది.
సిలియక్ రోగులకు చియా గింజలు
సిలియక్ అనేది గ్లూటిన్ అసహనం మరియు ప్రేగులలో ఒక గ్లూటిన్ సంబంధిత వాపుకు దారితీసే ఒక ఆటోఇమ్మ్యూన్ రుగ్మత. ఇటువంటి రోగులలో ప్రేగుల నుండి శోషణ (absorption) తగ్గిపోవడం వలన కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు జింక్ వంటి కొన్ని ముఖ్యమైన ఖనిజాల లోపానికి దారితీస్తుంది. చియా పిండి పోషకాలు మరియు ఖనిజాలకు గొప్ప వనరుగా ఉంటుంది. పరిశోధన ప్రకారం, గ్లూటిన్ -రహిత ఉత్పత్తులకు చియా పిండి చేర్చడం వలన సిలియక్ రోగులకు అవసరమైన ముఖ్య ఖనిజాలను అందించడంలో సహాయపడడంతో పాటు, ఇతర పోషక అవసరాలు కూడా తీరుతాయి.
చియా విత్తనాలను ఎలా ఉపయోగించాలి
చియా విత్తనాలు అజ్టెక్ మరియు మాయన్ ప్రజలచే వివిధ ఆహారాలు, మందులు, సౌందర్య ఉత్పత్తులు మొదలైన వాటిలో విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. కొలంబియా యొక్క చరిత్రపూర్వ సంఘాలు దీనిని మొక్కజొన్న తర్వాత రెండవ అత్యంత ముఖ్యమైన ఉత్పత్తిగా భావించాయి. మొత్తం విత్తనాలు, విత్తనాల పిండి మరియు వాటి నుండి తీసిన నూనె అన్ని కూడా ఆహారం, మందులు, సౌందర్య ఉత్పత్తులు మరియు మతపరమైన ఆచారాలు వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడ్డాయి.
ప్రస్తుతం చియా విత్తనాలను స్మూతీలు, అల్పాహార తృణధాన్యాలు, ఎనర్జీ బార్లు, గ్రానోలా బార్లు, పెరుగు, మరియు బ్రెడ్ వంటి వాటిలో వినియోగిస్తున్నారు. వాటిని వివిధ పానీయాలు మరియు పాలకు కూడా చేర్చవచ్చు. కేకు వంటి వంటకాలలో గుడ్లు లేదా నూనె ఉపయోగంలో ఒక పావు వంతుకి సమానమైన స్థానంలో చియా జెల్ ను ఉపయోగించవచ్చు. చియా విత్తనాలను మొత్తంగా తీసుకుంటే (బయట తొక్కతో పాటుగా) జీర్ణం కావు. కాబట్టి, చియా విత్తనాల యొక్క ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలనుకుంటే, వాటిని వినియోగించే ముందు వాటిని పిండి చేసి ఉపయోగించడం చాలా మంచిది.
చియా విత్తనాల దుష్ప్రభావాలు
జంతు మరియు మానవ ఆధారిత అధ్యయనాలు చియా గింజల యొక్క అనేక ప్రయోజనాల గురించి సూచించినప్పటికీ, నిర్వహించిన అధ్యయనాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందువల్ల అధిక మొత్తంలో చియా విత్తనాలను వినియోగించాలంటే వాటి యొక్క సంభావ్య దుష్ప్రభావాలను అధ్యయనం చేయటానికి కూడా తగిన పరిశోధన అవసరమవుతుంది. అయినప్పటికీ, విభిన్న అధ్యయనాలను అనుసంధానించడం ద్వారా తెలిసిన కొన్ని దుష్ప్రభావాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
1. చియా విత్తనాలు జీర్ణాశయ పనితీరు మీద ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి
చియా విత్తనాలు ఆహారపు ఫైబర్ యొక్క గొప్ప వనరులు. ఇది మలబద్ధక రోగులకు సహాయపడుతుంది. అయితే, ఫైబర్ యొక్క అధిక వినియోగం ఉబ్బరం, గ్యాస్, వాంతులు మొదలైనటువంటి జీర్ణ సమస్యలకు కూడా కారణమవుతుంది. అందువల్ల, రోజువారీ తీసుకున్న ఫైబర్ను జీర్ణించుకోవడానికి తగినన్ని నీళ్లు త్రాగడం చాలా మంచిది .
2. చియా గింజలు పొరబారేలా చేస్తాయి
చియా గింజలు వాటి పరిమాణం కంటే 10-12 రేట్ల నీటిని పీల్చుకుంటాయి. అందువల్ల, చియా విత్తనాలను తిన్న వెంటనే నీటిని త్రాగడం ప్రమాదకరమవుతుంది. ఒక కేస్ స్టడీలో, 39 ఏళ్ల వ్యక్తికి ఎసిఫేగల్ అడ్డంకి (పొరబారింది) ఏర్పడింది, చియా విత్తనాలను తిన్న వెంటనే నీరు త్రాగడం వలన అతడికి ఈ పరిస్థితి ఎదురైందని గుర్తించారు. అందువల్ల చియా గింజలను తినేముందు వాటిని నానబెట్టాలి ప్రత్యేకంగా పిల్లలికి వీటిని పెట్టేముందు మరింత జాగ్రత్తగా ఉండాలి మరియు చియా గింజలను తినగానే మంచి నీళ్ళు త్రాగడాన్ని నివారించాలి.
3. చియా విత్తనాల అధిక వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచవచ్చు
చియా విత్తనాల ప్రధాన భాగాలలో ఒకటి ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్. ఒక అధ్యయనంలో, రక్తములో అధికంగా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఉన్న వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిసింది. ఏదేమైనప్పటికీ, ఈ అధ్యయనాలు వివాదాస్పదంగా ఉన్నాయి మరియు ఈ విషయంలో ఇంకా చాలా పరిశోధన అవసరం.
4. చియా విత్తనాలు అలెర్జీలకు కారణం కావచ్చు
అన్ని ఇతర ఆహార పదార్థాల వలే, కొందరు చియా విత్తనాలకి కూడా అలెర్జీక్ అవుతారు. అలెర్జీ వాంతులు, దురద, విరేచనాలు, శ్వాసలో ఇబ్బందులు మొదలైన వాటికి దారితీస్తుంది.
5. చియా విత్తనాలు కొన్ని మందులతో ప్రతిచర్య చూపవచ్చు
చియా గింజలు రక్తపోటు మరియు రక్త చక్కెరను గణనీయంగా తగ్గిస్తాయి. అందువలన మధుమేహం మరియు రక్తపోటు మందులతో కలిపి ఈ విత్తనాలను తీసుకోకూడదని సూచించబడుతుంది.
ఉపసంహారం
చియా విత్తనాలు ముఖ్య పోషక ఆహారాలలో ఒకటిగా వర్గీకరించబడ్డాయి మరియు సూపర్ ఫుడ్స్ లేదా ఫంక్షనల్ ఫుడ్స్ అని చెప్పబడ్డాయి. ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్స్, ఖనిజాలు మరియు విటమిన్లు వంటి పోషకాల వలన వాటికి విస్తృతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తం విత్తనాలు, పిండి లేదా నూనె వంటి వివిధ రూపాలలో వీటిని ఉపయోగించవచ్చు. వీటిని బేకరీ ఉత్పత్తులలో, సలాడ్లలో స్ప్రింక్లర్లుగా (పైన చల్లేవి) లేదా పుడ్డింగ్గా తీసుకోవచ్చు. అయితే, చియా విత్తనాల అధిక వినియోగం అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. చియా విత్తనాలపై పరిశోధన చాలా తక్కువగా ఉంది. అందువల్ల, ఈ ఆహార పదార్దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ముందు సహజ ఆహార సప్లీమెంట్లగా చియా విత్తనాల యొక్క ప్రయోజనాల గురించి ఇంకా విస్తృతమైన పరిశోధన అవసరం.