నమస్కారం మూడు విధాలు

 ??|| నమస్కారం || ?

నమస్కారం భారతీయ సంస్కారం. కరచాలనం పాశ్చాత్యుల మర్యాద. నమస్కారం, ప్రణామం, వందనం- ఒకే చర్యను సూచించే పదాలు. నమః అంటే నమస్కారం. నమనం అంటే వంగడమని అర్థం. వంగి చేసేది నమస్కారం. నమస్కారం చేస్తూ పలికేమాట ‘నమో నమః’.

 

దైనందిన జీవితంలో యథాలాపంగా నమస్కారం పదం ఉపయోగిస్తున్నాం. దీనికి చాలా ఆధ్యాత్మిక వైశిష్ట్యం ఉంది. నమః అంటే త్యాగమని వాచ్యార్థం. ‘నేను అల్పుడిని, నీవు గొప్పవాడివి’ అనే దాస్యభావానికి సూచనగా ఈ పదం వాడుతున్నారని పండితులు భావిస్తున్నారు. ఇది ప్రధానంగా దైవసంబంధమైన విషయాలకు వర్తిస్తుంది. నమస్కారం తారక మంత్రం లాంటిదంటారు పెద్దలు. ఎవరినైనా ప్రసన్నం చేసుకోవడానికి చేసే నమస్కారాన్ని నమస్కార బాణంగా పేర్కొంటారు !!

 భీష్ముడు తన గురువు పరశురాముడితో యుద్ధం చేసిన సందర్భంలో ముందుగా నమస్కార బాణం ప్రయోగించాడు. ఆ బాణం గురువు పాదాల వద్ద వాలింది. అదే విధంగా అర్జునుడు భీష్ముడికీ నమస్కార బాణం వేశాడు !!

నమస్కారం మూడు విధాలు- కాయకం, వాచకం, మానసికం. కాయమంటే శరీరం. రెండు చేతులు జోడించి నమస్కరించడం కాయకం. పెద్దలు ఎదురైనప్పుడు ఈ పద్ధతిలో నమస్కరిస్తాం. ఆధ్యాత్మికంగా అష్టాంగ నమస్కారం పరమోత్తమం. శిరస్సు, రెండు భుజాలు, వక్షస్థలం, రెండు మోకాళ్లు, రెండు పాదాల వేళ్లు నేలకు ఆనేలా సాగిలపడటం. దేవతావిగ్రహాలకు, పీఠాధిపతులకు, సన్యాసులకు, గురువులకు సాష్టాంగ నమస్కారం ఆచరించాలి !!

 శిరస్సు, రెండు చేతులు, రెండు మోకాళ్లు నేలకు ఆనించడాన్ని పంచాంగ నమస్కారమంటారు. ఈ నమస్కారం స్త్రీలకు ఉత్తమమైనదని శాస్త్రవచనం. రెండు చేతులు శిరస్సుపై ఉంచి చేసే నమస్కారం త్య్రంగ(మూడు అంగాల) నమస్కారం. తల మాత్రమే వంచి చేసే నమస్కారం ఏకాంగ నమస్కారం !!

 రెండు చేతులు వ్యత్యస్తం చేసి- అంటే మార్చిపట్టుకుని చేసే నమస్కార ప్రక్రియ కూడా ఉంది. ఆధ్యాత్మిక గురువులకు ఈ విధానంలో నమస్కరించాలి. కుడిచేతిని గురువు కుడి పాదందగ్గర, ఎడమ చేతిని ఆయన ఎడమ పాదంవద్ద ఉంచి నమస్కరించడం. చేతులను ఆ పాదాల వద్ద నిలపాలి గాని తాకకూడదు. మీ పాదపద్మాలే నాకు శరణ్యమనే భావన ఇందులో ఉంది !!

లోకంలో ‘వందనం’ అనే మాట తరచుగా వింటుంటాం. ‘అభివందనం’ అనే మాట బాగా వాడుకలో ఉన్నదే. నవవిధభక్తి మార్గాల్లో ఇది ఒకటి. శిరస్సు వంచి చేసేది వందనం. రెండు చేతులూ జోడించాలి. అక్రూరుణ్ని వందన భక్తికి ఉదాహరణగా చెప్పడం పరిపాటి. ఉన్నది కంసుడి కొలువులోనైనా బలరామకృష్ణుల్ని మధురకు తీసుకువచ్చే అవకాశాన్ని అక్రూరుడు గొప్ప అదృష్టంగా భావించాడు. దారి పొడవునా చేతులు జోడించే ఉన్నాడు. కృష్ణపాద స్పర్శతో పునీతమైన బృందావనంలో పులకాంకితుడయ్యాడు. రామకృష్ణ సోదరుల్ని తన ఇంటికి వచ్చి పాదధూళితో పావనం చేయమన్నాడు !!

 వస్త్రాపహరణ సందర్భంలో ఆపన్న శరణ్యుడైన కృష్ణుడికి ద్రౌపది వందనం చేసింది. వందనం అహంకార వినాశనానికి ప్రతీక. అహంకారం నశిస్తే జీవుడికి పరమాత్మతో సాన్నిహిత్యం కలిగి జన్మ సఫలమవుతుంది !!

‘శేషశాయికి మ్రొక్కిన శిరము శిరము’ అన్నాడు పోతన. ‘వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామ’ అని త్యాగయ్య శ్రీరాముడికి వందనం అర్పించాడు. నమస్కార క్రియ మానసిక హోమం వంటిది.

నమస్కారం మొక్కుబడిగా కాక శ్రద్ధతో చేయాలి. కొందరికి నమస్కరించడానికి మనస్కరించకపోయినా, వారి ప్రాముఖ్యాన్ని బట్టి సందర్భాన్ని బట్టి గౌరవించక తప్పదు. నమ్రతతో చేసే నమస్కారమే సార్థకం !!

 

????????????

Leave a Comment