గోవిందరాజ స్వామి ఆలయ విశేషం

. గోవిందరాజ స్వామి ఆలయ విశేషం..

*******************************
 తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషను సమీపంలోనే, కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజ స్వామి. ఈయన శ్రీవేంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ నిర్వహణలోవే ఉంది.
త్వరిత వాస్తవాలు: పేరు, ప్రధాన పేరు : …
గోవిందరాజ స్వామి ఆలయం ప్రవేశ మార్గం
ఆలయ నిర్మాణం
ఆలయానికి రెండు గోపురాలున్నాయి. బయటి ఈ ఆలయం గాలి గోపురం బాగా పెద్దది. లోపలి వైపు గోపురం ఇంకా పురాతనమైనది. రామాయణ భాగవత గాధల శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. గోవిందరాజస్వామి విగ్రహం శేషశాయి. ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తరదిక్కుకు పాదాలు, దక్షిణదిశలో తల పెట్టుకుని, శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై, నాభికమలంలో బ్రహ్మతో, తలపై కిరీటం, దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి. మూల విరాట్టు గోవిందరాజ స్వామితో బాటు, అండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామానుజ తిరుమంగై ఆళ్వారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మి, శ్రీ మనవాళ మహాముని సన్నిధులున్నాయి. ఉత్తర దిశ ఆలయంలో అనంత శయనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజ స్వామి కొలువైయున్నాడు. ఆలయం దక్షిణ భాగాన రుక్మిణీ సత్యభామా సహితుడైన పార్ధ సారధి మందిరం ఉంది. వైశాఖ మాసంలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. గుడి ముందు పెద్ద కోనేరు ఉంది. కోనేరు నాలుగు ప్రక్కలా విశాలమైన మెట్లు కట్టారు. ఆలయం ప్రక్కనే “ఆలయ వాస్తు మ్యూజియం” ఉంది. ఇక్కడి మూల విగ్రహం మట్టితో చేసినందువలన అభిషేకం చేయకపోవడం ఒక విశేషం. తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలాగే గోవిందరాజస్వామి ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్ధతులే పాటిస్తారు.
చరిత్ర
ఆలయంలో ఉన్న అనేక శాసనాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైన సమచారాన్ని అందిస్తున్నాయి. అన్నింటికంటె పాత శాసనం ప్రకారం 1235లో మూడవ రాజరాజ చోళుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. 1239లో వీర నరసింగ యాదవరాయలు భార్య ఆలయం రథం నిమిత్తం, మరి కొన్ని మరమ్మతుల నిమిత్తం కానుకలు సమర్పించింది. 1506లో విజయ నగర రాజుల సాళువ వంశ కాలంలో ఆలయం బాగా అభివృద్ధి చెందింది.
క్రిమికంఠుడనే శైవుడైన రాజు రామానుజుల కాలంలో చిదంబర క్షేత్రంలోని శేషశయనుడైన విష్ణుమూర్తి ఆలయంపై దాడిచేసి విగ్రహాన్ని సముద్రంలోకి తోయించాడు. ఆలయంలోని వైష్ణవ పూజారులందరూ ప్రాణభయంతో రాజ్యాన్ని దాటి చెల్లాచెదురుగా పారిపోయారు. కొందరు పూజారులు స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకుని తిరుమల ప్రాంతంలో ఉన్న రామానుజాచార్యులను కలిశారు. ఆ విషయం తెలుసుకున్న రామానుజాచార్యులు బాధపడి చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారుచేయించి తిరుపతిలో ప్రతిష్ఠచేసారు. చిదంబరం నుంచి వచ్చిన ఉత్సవవిగ్రహ సహితంగా ఆరాధనలు, నిత్యపూజలు జరిగేలా కట్టుబాటు ఏర్పరిచారు. తన శిష్యుడైన యాదవరాజును ప్రోత్సహించి అప్పటికే వున్న తటాకానికి ప్రక్కన ఆ దేవాలయ నిర్మాణం చేశారు. దేవాలయ నిర్మాణం అనంతరం రాజు ఆలయం చుట్టూ ఒక అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు రామానుజాచార్యుల పేరిట రామానుజపురం అని పేరు పెట్టారు. 1830ల నాటికి కూడా ఆలయం ఆచార్యపురుషుల అధీనంలోనే ఉండేది. ఐతే ఆలయంపై ప్రభుత్వం పర్యవేక్షణ చేసేది. కోనేటి చుట్టూ నాలుగు ప్రక్కలా నిర్మించిన మెట్లు అనేక ఉద్యమాలకు ప్రచారస్థలాలుగా ఉపయోగపడ్డాయి. వైష్ణవోద్యమం ప్రచారానికి ఈ కోనేటిగట్టు కేంద్రంగా ఉండేది. రామానుజాచార్యుల భక్తి కూటములు ఇక్కడినుండే దక్షిణ భారతంలో వైష్ణవ ప్రచారం సాగించాయి. స్వాతంత్ర్యోద్యమ సమయంలో తిరుమల రామచంద్ర ఈ ఆలయం ఎక్కి స్వాతంత్ర్య పతాకాన్ని ఆవిష్కరించి పెద్ద సభను ఏర్పాటు చేశాడు. మొరార్జీ దేశాయి, నీలం సంజీవరెడ్డి, ఎస్.వి.సుబ్బారెడ్డి, కామరాజ్ నాడార్, నిజలింగప్ప, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి. రామారావు వంటి నాయకులు ఇక్కడినుండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసిద్ధ కవి శ్రీశ్రీ, హరికథకుడు సలాది భాస్కరరరావు, బుర్ర కథకుడు నాజర్, జర్నలిస్ట్ వరదాచారి, తెలుగుతల్లి గీత రచయిత శంకరంబాడి సుందరాచారి వంటి కళాకారుల ప్రదర్శనలు లేదా జీవితంలో ఘట్టాలు ఈ కోనేటిగట్టుతోముడివడి ఉన్నాయి. అయితే ఇప్పుడు పెరిగిన జన సమ్మర్ధం, కాలుష్యం కారణంగా ఈ కోనేటిగట్టు ఏ విధమైన సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలకూ వేదిక కావడంలేదు. ఆయా రాజులు సతీ సమేతంగా తమ చిత్రాలను ప్రధాన గోపురం లోపల చెక్కించి వున్నారు.
గోవింద రాజస్వామి వారి తెప్పోత్సవంలో ఒక దృశ్యం
ఒక కథనం ప్రకారం: చిదంబరంలో వున్న గోవింద రాజ స్వామి వారి విగ్రహాన్ని తెప్పించి ఈ గుడిలో 24-2-1130 లో ప్రతిష్టించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనె శ్రీ ఆండాల్ విగ్రహాన్ని కూడ ప్రతిష్టించారు. గోవింద రాజ స్వామి వారి విగ్రహం రాక ముందు నుండి అక్కడ పార్థ సారధి విగ్రహం వుండేది. దీని ఉత్తర దిశలో గోవింద రాజ స్వామి వారి విగ్రహాన్ని స్థాపించారు. చిదంబరంలో వుత్సవ విగ్రహంగా వుండిన గోవింద రాజ స్వామి వారి విగ్రహం ఇక్కడ మూల విరాట్టు అయింది. అప్పటిటి వరకు మూల విరాట్టయిన వరద రాజ స్వామి విగ్రహం ఉత్సవ విగ్రహం అయింది.
లీలలు
సంతానం లేని ఒక కాశీ రాజు కుటుంబసమేతంగా శ్రీనివాసుని సేవించి సంతాన భిక్షను కోరేందుకు తిరుమల వచ్చారట. స్వామిని కాశీరాజు దంపతులు దర్శించుకుని భక్తితో సేవించారట. స్వామి అనుగ్రించేందుకు, రాణి కలలో ప్రత్యక్షమై నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను. నీ ముక్కుకు ఉన్న నీనాసామణిని నాకు ఇవ్వు అన్నాడు. దానికి ఆమె స్వామివారితో నేను భర్త ఆజ్ఞకు లోబడి ఉండేదాన్ని. నా భర్త అనుమతిస్తే అలాగే ఇస్తాను అందట. అందుకు స్వామివారు అలా ఐతే- నేను నా అన్న గోవిందరాజుకు అధీనుడను – అతడు నీకు సంతానమివ్వమని నాకు అనుమతిస్తే అప్పుడే నీకు సంతానాన్ని ఇస్తాను. అంతేకాని మరే విధంగానూ కుదరదు అన్నాడని ప్రతీతి. ఈ కారణంగానే గోవిందరాజస్వామిని తిరుమలలో కొలువైన వేంకటేశ్వరునికి అన్నగా భక్తులు సంభావిస్తూంటారు.
ప్రాచుర్యం
తిరుమల శ్రీనివాసుడు, తిరుపతి గోవిందరాజులు రెండూ విష్ణు స్వరూపాలే ఐనా భక్తులు గోవిందరాజస్వామిని శ్రీనివాసుని అన్నగా భావిస్తూంటారు. తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళిన కొందరు భక్తులు తిరుపతిలోని గోవిందరాజస్వామి దర్శనం చేసుకునే కొండ ఎక్కేవారు. కొండపైకి ఎక్కలేని భక్తులు కొందరు గోవిందరాజస్వామిని దర్శించుకుని వెనుదిరిగారు.
విశేషాలు
“గోవిందా గోవిందా” అని స్మరిస్థు వెళ్ళి ముడుపులు మాత్రం వెంకటేశ్వరుడికి ఇస్తారని – గోల గోవిందుడిది అనుభవం వెంకటేశ్వరుడిది అనే సామెత భక్తులు పుట్టించారు.

Leave a Comment