Bellam Sunnundalu:బెల్లం సున్నూండలు తయారు చేసుకుని రోజూ తింటే చాలా ఆరోగ్యకరం
Bellam Sunnundalu:మనం వంటింట్లో ఉపయోగించే పప్పు దినుసుల్లో మినప పప్పు కూడా ఒకటి. మినప పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మినప పప్పుతో వివిధ రకాల అల్పాహారాలతోపాటు వివిధ రకాల తీపి పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు . మినప పప్పుతో చేసే తీపి పదార్థాలు అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేవి సున్నుండలు. సున్నుండలు ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. సాధారణంగా సున్నుండలను పంచదారతో తయారు చేస్తూ ఉంటారు. కేవలం పంచదారతోనే కాకుండా బెల్లంతో కూడా మనం సున్నుండలను తయారు చేసుకోవచ్చును . బెల్లంతో చేసే సున్నుండలు కూడా చాలా రుచిగా ఉంటాయి. తక్కువ సమయంలోనే సులభంగా, రుచిగా బెల్లంతో సున్నుండలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం సున్నుండలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
మినపగుళ్లు – 300 గ్రా
పొట్టు మినపగుళ్లు- 100 గ్రాములు,
తురిమిన బెల్లం 400 గ్రాములు,
తర్వాత నెయ్యి కరిగించుకోవాలి – సరిపడా.
Bellam Sunnundalu:బెల్లం సున్నూండలు తయారు చేసుకుని రోజూ తింటే చాలా ఆరోగ్యకరం
బెల్లం సన్నుండాలు తయారు చేసే విధానం:-
మినపగుళ్లను తీసుకుని ఒక కడాయిలో వేసి చిన్న మంటపై రంగు మారే వరకు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కడాయిలో పొట్టు మినపగుళ్లను కూడా వేసి చిన్న మంటపై రంగు మారే వరకు వేయించుకుని మినపగుళ్లను ఉంచిన ప్లేట్ లోకి తీసుకుని రెండింటిని కలపాలి. తరువాత వీటిని కొద్దిగా కొద్దిగా ఒక జార్ లోకి తీసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
మినపగుళ్లనన్నింటిని మిక్సీ పట్టుకున్న తరువాత ఆ పొడిలో తురిమిన బెల్లం వేసి బాగా కలపాలి. ఇప్పుడు బెల్లం తురుమును వేసి కలిపిన మిశ్రమాన్ని మరలా జారులో వేసుకుంటూ మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో కి తీసుకోవాలి . ఇప్పుడు ఈ మిశ్రమానికి 3 నుండి 4 టీస్పూన్ల నెయ్యిని వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుతూ కావల్సిన పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా తయారు చేసిన బెల్లం సున్నుండలు ఎంతో రుచిగా ఉంటాయి .
వీటిని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయడంవల్ల ఒక నెల వరకు తాజాగా ఉంటాయి. రోజుకు ఒకటి చొప్పున బెల్లం సున్నుండలు తిన్నా కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పిల్లలకు ఈ సున్నుండలను ఇవ్వడం వల్ల వారు పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల సున్నుండలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.