Pesara Pappu Kichdi: ఆరోగ్యకరమైన పెసర పప్పు కిచిడీ ఇలా తయారు చేసుకొండి
Pesara Pappu Kichdi :పెసలను తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్యపరమైన సానుకూల ప్రభావాలు లభిస్తాయని మనందరికీ తెలుసు. ఇవి మాంసానికి పోటీగా ఉండే పోషకాలతో నిండి ఉంటాయి. అలాగే నాన్ వెజ్ ఫుడ్స్ తినలేని వారు వీటిని తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. శరీరం పోషకాలను అందుకుంటుంది మరియు అనేక రకాల ఆరోగ్య రుగ్మతలను వదిలించుకోవడానికి బాగా సహాయపడుతుంది. పెసలను సహజ పద్ధతిలో తినలేకపోతే కిచిడీని తయారు చేసి తినవచ్చును . ఇది చాలా రుచికరమైనది. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పెసర పప్పు కిచిడీని ఎలా తయారు చేయాలి. దీని తయారు చేయడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పప్పు కిచిడీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
బియ్యం – రెండు కప్పులు
పెసర పప్పు-అరకప్పు
నూనె – 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
లవంగాలు- 3
యాలకులు – 2
దాల్చిన చెక్క – 2
బిర్యానీ ఆకు – 1
మిరియాలు- పావు టీస్పూన్
జీలకర్ర- సగం టీస్పూన్
పొడవుగా తరిగిన ఉల్లిపాయ- 1 (పెద్దది)
పొడవుగా తరిగిన పచ్చిమిర్చి- 4
కరివేపాకు- ఒకటి రెమ్మ
జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్
ఆలుగడ్డ – ఒకటి
క్యారెట్- ఒకటి
పచ్చి బఠాణీలు – ఒక టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్
టొమాటోలు – 2
పుదీనా ఆకులు- 10
తరిగిన కొత్తిమీర- కొద్దిగా
పసుపు – పావు టీస్పూన్
కారం – 1 టీస్పూన్
ధనియాల పొడి -అర టీస్పూన్
గరం మసాలా పొడి- అర టీస్పూన్
నీళ్లు – 6 కప్పులు
ఉప్పు- రుచికి సరిపడా
Pesara Pappu Kichdi: ఆరోగ్యకరమైన పెసర పప్పు కిచిడీ ఇలా తయారు చేసుకొండి
పెసర పప్పు కిచిడీ తయారు చేసే విధానము:-
ముందుగా గిన్నెలో బియ్యం, పెసర పప్పును నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి.తరువాత వాటికి తగినంత మేర నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని వేడి చేయాలి. వేడి అయిన కుక్కర్‌లో నూనె మరియు నెయ్యి వేసి వేడి చేసి దానిలో దాల్చిన చెక్క మిరియాలు మరియు లవంగాలు, ఏలకులు, జీలకర్ర, బిర్యానీ ఆకులను వేసి వేయించాలి.ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కరివేపాకు, జీడిపప్పు వేసి బాగా ఉడికించాలి.
ఇప్పుడు ఈమిశ్రమంలో బంగాళదుంప ముక్కలు పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించి ,వాటికి వెల్లుల్లి మరియు అల్లం పేస్ట్ వేసి ఆ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. దీనికి టొమాటో ముక్కలు పుదీనా మరియు కొత్తిమీర, కారం, పసుపు మిరియాల పొడి, ధనియాల పొడి మరియు గరం మసాలా వేసి, బాగా కలుపుకోవాలి .
ఇలా తయారి అయిన మిశ్రమానికి నానబెట్టిన బియ్యంతో పాటు పెసర పప్పు మరియు రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు వేయించి దానికి తగినన్ని నీళ్లను పోసి కలిపి మూతపెట్టి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఇలా ఉడికించుకున్న దాని మూత తీసి ఒకసారి కలుపుకోవాలి . ఈ విధముగా రుచికరమైన పెసర పప్పు కిచిడీ తయారు అవుతుంది. ఇది అల్పాహారం లేదా సాయంత్రం భోజనంలో భాగంగా రుచికరమైనది. రుచికరంగా ఉండటంతో పాటు విటమిన్లు.. ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనకు అందించవచ్చు. అందువల్ల, దీన్ని తరచూ తీసుకోవాలి.