Black Chickpeas Curry:రుచికరమైన నల్లశనగల కూర ఇలా చేసుకొండి
Black Chickpeas Curry: మనం వంటలో ఉపయోగించే శనగలలో నల్ల శనగలు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అద్భుతమైనవి. శనగలలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. శాకాహారులు ఆహారం కోసం శనగలు తినడం ద్వారా వారికి అవసరమైన ప్రోటీన్‌ను తీసుకోవచ్చు. వాటిని సాధారణంగా గుగ్గిల్స్‌గా తీసుకుంటారు. చాలా మంది వాటితో కూర కూడా వండుతారు. శనగలను ఉపయోగించి కూరను సులభంగా ఎలా తయారు చేయాలి. దానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నల్లశనగల కూర తయారీకి కావల్సిన పదార్థాలు:-
నల్ల శనగలు – ఒక కప్పు
పొడవుగా తరిగిన ఉల్లిపాయ -ఒకటి (పెద్దది)
టొమాటో- ఒకటి (పెద్దది)
అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకులు – ఒకటి
జీలకర్ర -అర టీ స్పూన్
కారం – ఒక టీస్పూన్
ధనియాల పొడి – ఒక టీ స్పూన్
నూనె – రెండు టేబుల్ స్పూన్స్
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
గరం మసాలా – పావు టీ స్పూన్
నీళ్లు – తగినన్ని
ఉప్పు – రుచికి సరిపడా
Black Chickpeas Curry:రుచికరమైన నల్లశనగల కూర ఇలా చేసుకొండి
నల్లశనగల కూర తయారు చేసే విధానము:-
ముందుగా నల్ల శనగలను తీసుకొని బాగా కడిగి తగినంత నీటిని పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొవాలి. దాని మీద ఇలా నానబెట్టుకున్న నల్ల శనగలను ఒక కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్లను పోసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.ఇప్పుడు ఒక కడాయి పెట్టి వేడి చేసుకోవాలి . వేడి అయిన కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దానిలో తరిగిన ఉల్లిపాయను వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక తరిగిన టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈమిశ్రమము బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈమిశ్రమము మొత్తం చల్లగా అయిన తరువాత ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి వేడి చేసి దానిలో టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక బిర్యానీ ఆకు,జీలకర్ర వేసి బాగా వేయించాలి. ఇవి పూర్తిగా వేగాక కారం వేసి కలుపుకోవాలి.ఇప్పుడు ఈమిశ్రమములో ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ను వేసి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించాలి. అలా నూనె పైకి తేలే వరకు ఉడికిన మిశ్రమములో ఉడక బెట్టిన శనగలు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఈమిశ్రమానికి సరిపడా ఉప్పును, నీళ్లను వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఇలా ఉడికిన కూరలో చివరగా కొత్తిమీర, గరం మసాలా ను వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధముగా రుచిగా ఉండే నల్ల శనగల కూర తయారవుతుంది. ఇలా చేసిన నల్ల శనగల కూరను అన్నం, చపాతీ లేదా పుల్కాతో పాటు తింటే చాలా రుచిగా ఉంటుంది. శనగలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
శనగలలో ప్రొటీన్లు మరియు ఐరన్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియ మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శనగలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు బరువును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. శనగలు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే, ఎంతో మేలు జరుగుతుంది.