Flaxseed Chilli Powder:రుచికరమైన అవిసె గింజల కారం పొడి ఇలా తయారు చేసుకొండి
Flaxseed Chilli Powder: ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలలో అవిసె గింజలు కూడా ఉన్నాయి.అవిసె గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీబాగా లభిస్తాయి. అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వాటిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అజీర్ణం యొక్క లక్షణాలను తగ్గించవచ్చును .అవిసె గింజలు బిపిని తగ్గించడంలో మరియు చక్కెరను అదుపులో ఉంచడంలో బాగా సహాయపడతాయి. శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ (LDL) మొత్తాన్ని తగ్గించడంలో మరియు మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయి.
అవిసె గింజలను ఆహార పదార్థాలుగా తీసుకుంటే, వాటిలోని ఫైబర్ ఆహారం క్రమంగా జీర్ణం కావడానికి సహకరిస్తుంది. అందుకే, మనకు అంత త్వరగా ఆకలి వేయదు.. ఆహారం తక్కువగా తీసుకుంటాం. అందువలన, బరువు తగ్గే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అవిసె గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల, అవిసె గింజలను ఆహారంలో ఒక అంశంగా చేర్చడం చాలా ముఖ్యం.
అదనంగా అవిసె గింజలతో కారం పొడిని తయారు చేసుకుని అన్నంలో మొదటి ముద్దలో కలిపి తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ క్రమంలోనే అవిసె గింజల కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజల కారం పొడి తయారీకి కావలసిన పదార్థాలు:-
అవిసె గింజలు: 1 కప్పు
నూనె- 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు -2 టేబుల్ స్పూన్లు
మినప పప్పు – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర గింజలు – 2 టేబుల్ స్పూన్లు
మెంతులు 1/4 టీస్పూన్
ఎండు మిరపకాయలు – 15-20
కరివేపాకు – 2 రెమ్మ
చింతపండు – కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు – 6
జీలకర్ర – 1/2 టీస్పూన్
ఉప్పు-తగినంత.
Flaxseed Chilli Powder:రుచికరమైన అవిసె గింజల కారం పొడి ఇలా తయారు చేసుకొండి
అవిసె గింజల కారం పొడిని తయారుచేసే విధానం:-
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకోవాలి . కడాయి వేడి అయిన తరువాత దానిలో అవిసె గింజలను వేసి 10 నిమిషాల పాటు చిన్న మంటపై వేయించుకోవాలి.అలా వేయించిన అవిసె గింజలను ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి మిగిలిన పదార్థాలన్నింటినీ వేసుకోవాలి . ఇవి బాగా వేయించుకొని చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి.
తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా వేయించిన అవిసె గింజలను వేసి మెత్తని పొడిలా చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో ముందుగా వేయించిన పెట్టిన ఎండు మిరపకాయల మిశ్రమంతోపాటు తగినంత ఉప్పును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న అవిసె గింజల పొడిని వేసి అంతా కలిసేలా మరో సారి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధముగా రుచిగా ఉండే అవిసె గింజల కారం పొడి తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు లేదా ఇడ్లీ, దోశ వంటి వాటితో కూడా కలిపి తినవచ్చును . ఇది చాలా రుచికరమైనది. అదనంగా, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.