తెలుగు పొడుపు కథలు -2

తెలుగు పొడుపు కథలు -2

 

ఒకరు పొడుస్తారు, ఒకరు విడుస్తారు?  సమాధానం :పొడుపు కథ

నల్ల స్తంభం పైన నలుగురు దొంగలు?  సమాధానం :లవంగం మొగ్గ

కాయలు కాని కాయలు, ఏమి కాయలు?  సమాధానం :మొట్టి కాయలు

అమ్మంటే దగ్గరకొచ్చి నాన్నంటే దూరంగా పోతాయి?  సమాధానం :పెదవులు

ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి?సమాధానం :తక్కెడ

అడుగులున్నా, కాళ్ళులేనిది?సమాధానం :గజము బద్ద, మీటర్ స్కేలు

అందని వస్త్రం పై అన్నీ వడియాలే?సమాధానం :నక్షత్రాలు

అందరికి చెప్పి వొచ్చేది, చెప్పకుండా వెళ్ళేది?సమాధానం :ప్రాణం

అందమైన చిన్నది, అందాల చిన్నది, నువ్వు చుస్తే నిన్ను చూస్తుంది, నేను చుస్తే నన్ను చూస్తుంది?సమాధానం :అద్దము

కీచు కీచు పిట్ట! నేలకేసి కొట్ట!!సమాధానం :చీమిడి

కిట కిట తలుపులు! కిటారు తలుపులు!! ఎప్పుడు తీసినా చప్పుడు కాదు?సమాధానం :కను రెప్పలు

కిరీటము ఉంటుంది కాని రాజును కాదు, నాట్యము చేస్తాను కాని మయూరిని కాదు?సమాధానం :నాగుపాము

కాటుక రంగు, కమలము హంగు! విప్పిన పొంగు, ముడిచిన క్రుంగు!!?సమాధానం :గొడుగు

తల లేదు కాని గొడుగు ఉంది, పాము లేదు కాని పుట్ట ఉంది?సమాధానం :పుట్ట గొడుగు

కార్డు కాని కార్డు, ఏమి కార్డు?సమాధానం :రికార్డు

కాయ, పువ్వు లేని పంట?  సమాధానం :ఉప్పు పంట

కలి కాని కలి, ఏమి కలి? సమాధానం :చాకలి

కడుపు లోన పిల్లలు, కంఠము లోన నిప్పులు! అరుపేమో ఉరుము, ఎరుపంటే భయము!!?సమాధానం :రైలు

కోడి కాని కోడి, ఏమి కోడి? సమాధానం :చకోడి

కొనే టప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పారేసేటప్పుడు తెలుపు ఏమిటది?సమాధానం :పుచ్చకాయ

అన్నింటికన్నా విలువైనది, అందరికి అవసరమైనది?సమాధానం :ప్రాణము

గింజ మునుగుతుంది, కాయ తేలుతుంది?సమాధానం :వేరుశెనగ కాయ

గాలిలో ఎగిరే అద్దము పట్టుకుంటే పలిగి పోవు?సమాధానం :సబ్బు బుడగ

కాయ కాని కాయ, అతి చిన్న కాయ?సమాధానం :చెమటకాయ

కర్రలతో అతి చిన్న కర్ర?సమాధానం :జీలకర్ర

గట్టుమీద రాయి! మినుకు మినుకు రాయి!!సమాధానం :ముక్కు పుడక

గోడకు గొలుసు పండు!?సమాధానం :లాంతరు

చీకటి ఇంటిలో జడల దయ్యము?సమాధానం :ఉట్టి

చింపిరి గుడ్డలు! బంగారం లాంటి బిడ్డలు!!సమాధానం :మొక్క జొన్న

చిన్న చిట్టిలో కమ్మని కూర?సమాధానం :కిల్లీ

చిక్కటి కారడవిలో చక్కటి దారి?సమాధానం :పాపిట

చారల పాపకి దూది కుచ్చు!సమాధానం :ఉడుత

నూరు పళ్ళు ఒకటే నోరు?సమాధానం :దానిమ్మ

సన్నని స్తంభం, ఎక్కలేరు, దిగలేరు?సమాధానం :సూది

ఎర్రవాడొస్తే తెల్లవాడు, పారిపోయి దాక్కుంటాడు?సమాధానం :సూర్యుడు, చంద్రుడు

పొంచిన దయ్యం! ఉన్న చోట ప్రత్యక్షం!!సమాధానం :నీడ

అంగట్లో ఉంటాను, ఇంట్లో అంగి విప్పుతాను! నన్ను గాని ముట్టుకుంటే నూతిలో దూకుతాను!!

సమాధానం :అరటి పండు

ఇంట్లో మొగ్గ, వీధిలో పువ్వు?సమాధానం :గొడుగు

అడవిలో పుట్టాను, నల్లగా అయ్యాను, ఇంటికి వచ్చాను, ఎర్రగా మారాను, తొట్టిలో పడ్డాను తెల్లగా మారాను?సమాధానం :బొగ్గు

పైన పచ్చ ఏనుగు, లోన తెల్ల పీనుగు?సమాధానం :అరటి కాయ

బారు కాని బారు, ఏమి బారు?సమాధానం :సాంబారు

పిల్లలకు ఉచితము! పెద్దలకు బహుమానము!! యూవతీ యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము?సమాధానం :ముద్దు

హారము కాని హారము, ఏమి హారము?సమాధానం :ఆహారము

పుట్టినపుడు పురుగు! పెరిగితే పువ్వుల రాజు?సమాధానం :భ్రమరము

బడి కాని బడి, ఏమి బడి?సమాధానం :రాబడి

పగలు తపస్వి, రాత్రి పండ్ల తోటలో రాక్షసి!?సమాధానం :గబ్బిలం

బొట్టు కాని బొట్టు, ఏమి బొట్టు?సమాధానం :తాళిబొట్టు

పచ్చని గుడిలో ఎరుపు రత్నాలు?సమాధానం :దానిమ్మ గింజలు

మతి కాని మతి, ఏమి మతి? సమాధానం :శ్రీమతి

మూడు కన్నులుండు, ముక్కంటిని కాను! నిండా నీరు ఉండు, కుండను కాను!!సమాధానం :కొబ్బరి కాయ

మామ కాని మామ, ఏమి మామ?సమాధానం :చందమామ

పచ్చని పొదలో పిచ్చుక విచ్చుకుంది! తెచ్చుకోబోతే గుచ్చుకుంది?సమాధానం :మొగిలి పువ్వు

చెవుల పక్క నక్కి ముక్కు మీదకెక్కుతుంది?సమాధానం :కళ్ళ జోడు

మేక తిన్నాను, తోక పారేశాను?సమాధానం :వంకాయ

బాడీ కాని బాడీ, ఏమి బాడీ?సమాధానం :లంబాడి

పలుకు కాని పలుకు, ఏమి పలుకు?సమాధానం :వక్క పలుకు

పైన పటారాము! లోన లొటారాము!!?సమాధానం :మేడి పండు

మంచము కింద మామ! ఉరికి పోదాం రావా!!?సమాధానం :చెప్పులు

మర కాని మర, ఏమి మర?సమాధానం :పడమర, అలమర

మీకు సొంతమైనది కాని, మీకన్నా మీ తోటి వారు ఎక్కువగా వాడతారు?సమాధానం :మీ పేరు

మని కాని మని, ఏమి మని?సమాధానం :ఆమని

మానము కాని మానము, ఏమి మానము?సమాధానం :విమానము

మేమిద్దరం మిమ్మల్ని మోస్తాము, మీ అవసరము తీరాక మూలన పడుకుంటాము?సమాధానం :చెప్పులు

మూసింది తెరువ! తెరువంగ అరువ!!?సమాధానం :ఆవులింత

రాజు వారి తోటలో రోజూ కాసే పూలు! చూసే వారే కాని కోసే వారు లేరు!!?సమాధానం :నక్షత్రాలు

వరి కాని వరి, ఏమి వరి?సమాధానం :జనవరి

ప్రపంచం మొత్తం తిరిగేది, అన్నింటికన్నా వేగమైనది?సమాధానం :మనసు

శాఖలున్నా ఆకులు లేనిది?సమాధానం :సంస్థ

చాచుకొని, సావిట్లో పడుకునే ముసలమ్మ, ముడుచుకొని మూల నిలబడింది?సమాధానం :చాప

చెయ్యని కుండ! పోయని నీరు!!?సమాధానం :కొబ్బరి కాయ

నరుడు కాని నరుడు, ఏమి నరుడు?సమాధానం :వానరుడు

నగలు కాని నగలు, ఏమి నగలు?సమాధానం :శెనగలు

నూరుగురు అన్నా తమ్ముళ్లకు ఒకటే మొలతాడు?సమాధానం :చీపురు

పట్టుకుంటే పిడికెడు, విడిస్తే ఇల్లంతా?సమాధానం :దీపం

పట్టు సంచిలో బంగారు గుడ్లు?సమాధానం :ఎండు మిరపకాయలు

మనదొకటి తడవదు, ఎండదు, ఆరదు?సమాధానం :నీడ

వెండి గిన్నెలో దాగిన బంగారం?సమాధానం :కోడి గుడ్డు

మనిషి మనిషి మధ్య రథ సారథి నేను, నేను లేకుంటే ప్రపంచమే లేదు?సమాధానం :ప్రేమ

రెక్కలుంటాయి, రయ్ రయ్ మంటుంది, ఎగురలేదు కాని ఎగురవేస్తుంది?సమాధానం :ఫ్యాన్

రణము కాని రణము, ఏమి రణము?సమాధానం :చరణము

బంగారు బిడ్డలు, వెచ్చని దుస్తులు, గుర్రపు వెంట్రుకలు?సమాధానం :మొక్కజొన్న

రాయి కాని రాయి, ఏమి రాయి?సమాధానం :కిరాయి

ఉన్న చోటే ఉంటుంది, వేళా పాలా చెపుతుంది?సమాధానం :గోడ గడియారం

రంగము కాని రంగము, ఏమి రంగము?సమాధానం :చదరంగము

మతము కాని మతము, ఏమి మతము?సమాధానం :కమతము

అన్నకు అందవు కాని తమ్ముడికి అందుతాయి?సమాధానం :పెదవులు

వాలు కాని వాలు, ఏమి వాలు?సమాధానం :ఆనవాలు

రేట్లెంత పెరిగినా ఎప్పుడూ పది పైసలకు రెండు వొచ్చేవి?సమాధానం :రెండు ఐదు పైసల బిళ్ళలు

వల కాని వల, ఏమి వల?సమాధానం :నవల

రోజుకో ఆకారం మారుస్తాడు, చివరకు నిండు సున్నా అవుతాడు?సమాధానం :చంద్రుడు

గుప్పెడంత లోగిలిలో యాభై మంది నివాసం?సమాధానం :అగ్గి పెట్టె

వారు కాని వారు, ఏమి వారు?సమాధానం :నవారు

విత్తనం లేకుండా మొలిచేది?సమాధానం :గడ్డము

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top