గరుడ పంచమి అంటే ఏంటీ ? దీని విశిష్టత ఏంటీ ?

గరుడ పంచమి అంటే ఏంటీ ? దీని విశిష్టత ఏంటీ ?


కశ్యప ప్రజాపతికి వినత .. కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి ... 'నాగ పంచమి'గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని 'గరుడ పంచమి' అని కూడా పిలుస్తుంటారు.


శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్పభయం లేకుండా వుండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే ' గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది.


సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా ... లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది.

అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన ... ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది.


గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యంపోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. మరి కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది.


0/Post a Comment/Comments

Previous Post Next Post