శ్రీ సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి. సుబ్రహ్మణ్యస్వామి చరిత్ర

 శ్రీ సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి. 
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి స్కంద షష్ఠి అనగా ఏమి?ఆరోజు ఏం చేస్తారు ? ఏం చేస్తే శుభం కలుగుతుంది?
శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామియే కుమారస్వామి,కార్తీకేయుడు,స్కందుడు,షణ్ముఖుడు, మురుగన్,గుహూడు అనే మొదలగు పేర్లుతో కూడా పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని కూడా అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి ,సుబ్బరాయుడు షష్టి,తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు.దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే “శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు,కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కూడా కనబడుతుంది. పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న”తారకా సురుడు” అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు.
అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం కూడా చెప్పాడు. దేవతలు శివున్నిఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు.ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో కూడా పిలువబడ్డాడు.
కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి,దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు “శూలం” మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి “శక్తి” అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి “సర్పరూపం” దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.
సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి”గా పిలుచుకుంటున్నాము, “శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు.
ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు,పువ్వులు,వెండి పడగలు,వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజ దోషం,కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది.
నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో చాలా ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం లో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని,ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని,దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా “పరోప కారం మిధం శరీరం” అని భావించి పేదవారికి స్వేటర్లు , కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను,తిను బండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి.
ఈ స్కంద షష్ఠి పర్వదినాన అత్యంత శక్తివంతమైన ” శ్రీ స్కంద షష్ఠి కవచం ” పారాయణ చేయడం విశేష ఫలప్రదం.
ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ
ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ
ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ…

దక్షిణ భారతదేశంలో నెలకొన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో విశిష్టమైందిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పళని  (పళని మల) ఒకటి . ఆరోగ్యానికీ, ఆధ్యాత్మిక శోభకూ నెలవుగా పేరుగాంచిన ఈ ఆలయం విశేషాలు సుబ్రహ్మణ్య షష్ఠి (డిసెంబరు 2) సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు.

Read More  గురుశిష్యుల మధ్య న్యాయాలు....

తమిళనాడులోని దిండుగల్‌ జిల్లాలో కొలువై ఉన్న ఈ సుబ్రహ్మణ్య ఆలయాన్ని పళని అరుల్మిగు శ్రీ దండాయుధపాణి క్షేత్రమనీ కూడా అంటారు. ఇడుంబన్‌ కొండపైన కార్తికేయుడిగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్య స్వామికి కార్తికమాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. షష్ఠినాడు కావడి ఉత్సవం అంగరంగవైభవంగా  కూడా జరుగుతుంది.

ఆ సంబరానికి దేశం నలుమూలల్నుంచీ లక్షలాది భక్తులు హాజరవుతారు. ఈ ఆలయాన్ని ఏడో శతాబ్దంలో కేరళరాజు చీమన్‌ పెరుమాళ్‌ నిర్మించారు. తరవాత పాండ్యులు పునరుద్ధరించారు. భోగార్‌ అనే ముని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో తయారు చేసిన స్వామి వారి విగ్రహమే గర్భాలయంలో దర్శనమిస్తుంది. గతంలో స్వామివారి తొడ భాగం నుంచి తీసిన విభూతిని కుష్ఠు రోగులకు పంచేవారు. అలా చేయడం వల్ల విగ్రహం అరిగిపోవడంతో ఇప్పుడు విభూతి పంపకాన్ని కూడా నిలిపేశారు.

 

స్థలపురాణం…

ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందించి తమ కుమారులిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే దాన్ని ఇవ్వమని కూడా  చెబుతాడు. దాంతో వారు తమ కుమారులతో ముల్లోకాలనూ చుట్టి రమ్మనీ ఎవరు ముందు వస్తే వారికే ఫలమనీ చెబుతారు. వెంటనే కుమార స్వామి తన నెమలి వాహనంపై ముల్లోకాల ప్రదక్షిణకు వెళ్తాడు. కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్లినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు. తన సోదరుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల్ని చుట్టిన ఫలితం పొందాడని తెలుసుకుని నిరాశగా భూలోకంలోని ఒక కొండ మీద మౌన ముద్రలో ఉండిపోతాడు. విషయం తెలుసుకున్న గౌరీశంకరులు అక్కడకు చేరుకుని చిన్నబుచ్చుకున్న కార్తికేయుడితో ‘కుమారా… సకల జ్ఞానాలకూ నీవే ఫలానివి’ అని బుజ్జగిస్తారు. సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో ‘పళం’, నీవు అంటే ‘నీ’ ఈ రెండు కలిపి ఆ ప్రాంతం పళని అయింది. దాంతో భక్తులకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఎప్పటికీ ఆ కొండమీదే శాశ్వతంగా కొలువై ఉంటానంటూ తల్లిదండ్రులను కైలాసానికి వెళ్లిపొమ్మని చెబుతాడు కార్తికేయుడు. అందుకే అక్కడకు బుద్ధిమాంద్యం ఉన్న చిన్నారులకు ఎక్కువగా తీసుకెళుతుంటారు.

Read More  ఇంద్రియ నిగ్రహ సాధన.....

కావడి ఉత్సవం విశిష్టత…

కుమారస్వామి శిష్యుల్లో అగస్త్య మహాముని ఒకరు. పూర్వం దేవదానవ యుద్ధంలో చాలా మంది దానవులు చనిపోయాక వారిలో ఒకడైన ఇడుంబన్‌ అనే రాక్షసుడు బతికి తన అసుర గణాలను వదిలి అగస్త్యుడి శిష్యునిగా కూడా మారతాడు. అయితే ఇడుంబన్‌లోని రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని భావిస్తాడు అగస్త్యుడు. ‘నాయనా, నేను కైలాసం నుంచి శివగిరి, శక్తిగిరి అనే రెండు కొండలను తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నా. ఎలాగైనా వాటిని ఒక కావడిలో పెట్టుకుని రా’ అని ఆజ్ఞాపిస్తాడు. ముని చెప్పినట్టే కైలాసం వెళ్లి కొండలను కావడిలో పెట్టుకుని బయలుదేరుతాడు ఇడుంబన్‌.
ఆ రాక్షసుడి అసురత్వాన్ని సుబ్రహ్మణ్యుడే పోగొడతాడని శివుడు అందుకు అడ్డు చెప్పడు. అలా కొండల్ని మోసుకుని కొంతదూరం వెళ్లిన ఇడుంబన్‌ పళని ప్రాంతంలో వాటిని కింద పెట్టి సేదతీరతాడు. కాసేపటికి లేచి కావడి ఎత్తుకుంటే ఒకవైపు బరువుగా, ఇంకోవైపు తేలిగ్గా ఉండటం గమనిస్తాడు. కావడిని దించి చూస్తే బరువున్న కొండపైన సుబ్రహ్మణ్య స్వామి చిన్న పిల్లాడి రూపంలో ప్రత్యక్షమై పకపకా నవ్వుతూ కనిపిస్తాడు. ఆ చర్యకి కోపమొచ్చిన ఇడుంబన్‌ స్వామిని వధించాలని కొండపైకి వెళతాడు. ఆగ్రహించిన సుబ్రహ్మణ్యుడు అతడిని సంహరిస్తాడు. విషయం తెలిసిన అగస్త్యముని ఇడుంబన్‌ను బతికించమని వేడుకుంటాడు. శిష్యుడి కోరికను మన్నించిన స్కందుడు ఇడుంబన్‌ను బతికించి… తన కొండ కిందకొలువై ఉండమనీ, భక్తులు ముందుగా అతడిని దర్శించుకున్నాకనే తన సన్నిధికి రావాలనీ వరమిస్తాడు.
అలానే షష్ఠినాడు పాలు, విభూతి, పూలు, తేనె, నెయ్యి… వీటిలో ఏదో ఒకటి కావడిలో పెట్టుకుని పాదచారులై కొండకొస్తే తనని ఆరాధించిన  ఫలితం దక్కుతుందని చెప్పి సుబ్రహ్మణ్యస్వామి అదృశ్యమవుతాడు. అప్పట్నుంచీ పళని కొండకి ఇడుంబన్‌ అనే పేరు వచ్చింది. స్వామి వారి మెట్ల మార్గం దగ్గర ‘ఇడుంబన్‌’ గుడి ఉంటుంది. భక్తులు ఆ మూర్తిని దర్శించుకున్నాకే వల్లీదేవసేన సమేతుడైన కుమారస్వామి సన్నిధికి వెళతారు.  ఈక్షేత్రం మదురైకి 120 కి.మీ దూరంలో ఉంది.
హైదరాబాద్‌ నుంచి మదురైకి విమానంలో వెళ్లి అక్కణ్నుంచీ రోడ్డు లేదా రైలు మార్గంలో వెళ్లొచ్చును . రైల్లో అయితే హైదరాబాద్‌ నుంచి మదురైగానీ, చెన్నై సెంట్రల్‌ వరకూగానీ వెళ్లి అక్కణ్నుంచీ చెన్నై సెంట్రల్‌ -పళని ఎక్స్‌ప్రెస్‌లో పళని చేరుకోవచ్చును . రైల్వే స్టేషన్‌ నుంచి దేవాలయానికి ఆటో, బస్సుల సౌకర్యం కూడా ఉంటుంది.
Sharing Is Caring:

Leave a Comment