Allam Murabba:అల్లం మురబ్బా తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
Allam Murabba: అల్లం మురబ్బా మనందరికీ తెలిసిందే. దీనిని కొన్నిసార్లు జింజర్ క్యాండీగా సూచిస్తారు. చాలా మంది దీన్ని ఇష్టపడి తింటారు. అల్లం మురబ్బా యొక్క రుచిని పక్కన పెడితే, దానిని తినడం మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అల్లం మురబ్బా ముక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్త ప్రసరణ చురుకుగా సాగుతుంది.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్వాసను మెరుగుపరుస్తుంది మరియు నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. ఇది వికారం మరియు తల తిరగడం కూడా తగ్గిస్తుంది. తరచుగా పునరావృతమయ్యే అంటువ్యాధులు ఉన్నవారు ప్రతిరోజూ ఒక చిన్న అల్లం మురబ్బా ముక్కను తినడం వల్ల వారి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది మరియు ఇన్ఫెక్షన్లను నివారించడంలో బాగా సహాయపడుతుంది. తలనొప్పులు, జలుబు, గొంతునొప్పి, దగ్గు తగ్గడానికి కూడా అల్లం మురబ్బా బాగా ఉపయోగపడుతుంది. అల్లం మురబ్బా ప్రపంచంలో సమృద్ధిగా దొరుకుతుంది. అయితే దీన్ని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అల్లం మురబ్బా తయారు చేయడానికి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం మురబ్బా తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు:-
అల్లం ముక్కలు – 100gm
తురిమిన బెల్లం – 400 గ్రాములు
నెయ్యి- కొద్దిగా
నీరు- 1 కప్పు
ఉప్పు- చిటికెడు.
Allam Murabba:అల్లం మురబ్బా తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
అల్లం మురబ్బా ను తయారు చేసే విధానము:-
అల్లం ముక్కలను జార్ లో వేసి నీళ్లు పోయకుండా మెత్తగా చేసుకోవాలి. ఒక ప్లేట్ కు లేదా పీట మీద కానీ నెయ్యిని రాసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి ఆన్ చేసి ఇప్పుడు గిన్నెలో లేదా కడాయిలో బెల్లం తురుమును, నీళ్లను పోసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా కరిగించిన బెల్లాన్ని పాకం వచ్చే వరకు మరిగించాలి. ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని అందులో మరిగించిన బెల్లం మిశ్రమాన్ని కొద్దిగా వేసి ముద్దగా చేయాలి. ఈ మిశ్రమం ముద్దగా చేయడానికి వస్తే పాకం వచ్చిందని భావించాలి. బెల్లం మిశ్రమం ముద్దగా చేయడానికి రాకపోతే పాకం వచ్చే వరకు మరిగించాలి. పాకం వచ్చిన తరువాత మెత్తగా చేసుకున్న అల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మంటను చిన్నగా చేసి 5 నుండి 6 నిమిషాల పాటు కలుపుతూ మరిగించాలి. ఇందులోనే కొంచెం ఉప్పును వేసి కలుపుకోవాలి. 5 లేదా 6 నిమిషాల తరువాత మరోసారి పాకాన్ని సరిచూసుకోవాలి. ముందు చేసిన విధంగానే గిన్నెలో నీళ్లను తీసుకుని అందులో బెల్లం మిశ్రమాన్ని వేసి ముద్దలా చేసి చూడాలి. ముద్దగా చేయడానికి వస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం మిశ్రమం ముద్దగా చేయడానికి రాకపోతే మరికొద్ది సేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్టవ్ను ఆఫ్ చేసిన వెంటనే ఈ మిశ్రమాన్ని నెయ్యిని రాసి ఉంచిన ప్లేట్ లేదా పీట మీద పోసి మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా పరచుకోవాలి. ఇలా పరచుకున్న మిశ్రమాన్ని కొద్దిగా చల్లగా అయ్యే వరకు ఉంచి కత్తితో కావల్సిన పరిమాణంలో గాట్లు పెట్టుకోవాలి . బెల్లం మిశ్రమం పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచి గాట్లు పెట్టిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఈవిధం గా అల్లం మురబ్బ తయారవుతుంది. అల్లం మురబ్బ తయారీలో బెల్లానికి బదులుగా చక్కెరను కూడా ఉపయోగించవచ్చును . రోజూ పరగడుపున ఒక ముక్క అల్లం మురబ్బను తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. తరచూ రోగాల బారిన పడకుండా ఉంటారు.